🏠 www.aayudham.net
Watermark
Clip Header Logo
Date of Publish : 29 September 2026, 8:10 pm Posted by : AAYUDHAM

ఖర్గేను అవమానించడం రాజ్యాంగ విలువలకు విరుద్ధం ఉత్తరాఖండ్‌ ఘటనపై భట్టి విక్రమార్క ఆగ్రహం.. నిరసనకారులపై కేసుల నమోదుపై ప్రశ్న

News Image
ఖర్గేను అవమానించడం రాజ్యాంగ విలువలకు విరుద్ధం

ఉత్తరాఖండ్‌ ఘటనపై భట్టి విక్రమార్క ఆగ్రహం.. నిరసనకారులపై కేసుల నమోదుపై ప్రశ్న

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 29 (ఆయుధం):

కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను అవమానించేలా ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకున్న ఘటన రాజ్యాంగ విలువలకు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్‌ క్లబ్‌లో ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత–ఆదివాసీ ఆత్మగౌరవ సదస్సులో ఆయన ప్రసంగించారు.

ఖర్గే హాజరైన సభా ప్రాంగణాన్ని అనంతరం ‘శుద్ధీకరణ’ పేరుతో కార్యక్రమం నిర్వహించడాన్ని భట్టి విక్రమార్క తప్పుబట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధి ఒక సభలో పాల్గొన్నందుకు ఆ ప్రదేశాన్ని శుద్ధి చేయడం వంటి చర్యలు సమాజంలో వివక్షపూరిత భావజాలంపై ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలి

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చూపిన సమానత్వ మార్గంలో దేశం ముందుకు సాగాల్సిన సమయంలో దళిత నాయకుడిని అవమానించేలా వ్యవహరించడం బాధాకరమని భట్టి విక్రమార్క అన్నారు. ఇది ఒక్క మల్లికార్జున ఖర్గేకు సంబంధించిన అంశంగా కాకుండా రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సామాజిక సమానత్వానికి సంబంధించిన అంశంగా చూడాలని పేర్కొన్నారు.

ఈ ఘటనపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌ నేతలు పోలీసులను ఆశ్రయించగా, ఫిర్యాదులను పరిశీలించి బాధ్యులపై కేసులు నమోదు చేయాల్సిన ప్రభుత్వం నిరసన తెలిపిన వారిపైనే కేసులు పెట్టడం ఏ విధమైన ప్రజాస్వామ్య పద్ధతి అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు.

అధికారంలో ఉన్నవారు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత కలిగి ఉన్నారని, వివక్షకు తావులేని సమాజ నిర్మాణానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రతి పౌరుడికి సమాన గౌరవం, సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించడమే రాజ్యాంగం నిర్దేశించిన మార్గమని పేర్కొన్నారు.

కులం, మతం, ప్రాంతం ఆధారంగా ఎవరినీ అవమానించే పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క కోరారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలకు స్థానం ఉంటుందని, రాజకీయ ప్రత్యర్థులను గౌరవించడం కూడా ప్రజాస్వామ్య సంస్కృతిలో భాగమేనని అన్నారు.

ఉత్తరాఖండ్‌లో ఖర్గే సభ అనంతరం హల్ద్వానీలోని రామలీలా మైదానంలో జరిగినట్లు ఆరోపణలు వచ్చిన ‘శుద్ధీకరణ’ ఘటనపై సెప్టెంబర్‌ 8న హల్ద్వానీ పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పలు జాతీయ మీడియా సంస్థలు నివేదించాయి. అంతకుముందు ఈ వ్యవహారంపై రాజకీయపరమైన వివాదం కొనసాగింది
🏠 Home