🏠 www.aayudham.net
Watermark
Clip Header Logo
Date of Publish : 29 September 2026, 4:35 pm Posted by : AAYUDHAM

వృద్ధుల సేవలో నాన్న స్వచ్ఛంద సేవా సంస్థ

News Image
వృద్ధులకు నిత్య అన్నదానం
వృద్ధుల సేవలో నాన్న స్వచ్ఛంద సేవా సంస్థ

నేలకొండపల్లి, సెప్టెంబర్‌ 29 (ఆయుధం): చెరువుమాదారం గ్రామంలో నాన్న స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు నిత్య అన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది. గత నాలుగు, ఐదు నెలలుగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రతిరోజూ మధ్యాహ్నం వృద్ధులకు భోజనం అందిస్తూ సంస్థ సభ్యులు సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామంలోని 50 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల వృద్ధులకు భోజనం అందిస్తూ వారి ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.

ఈ సందర్భంగా సంస్థ బాధ్యులు మాట్లాడుతూ.. వృద్ధులకు అన్నదానం చేయడం ఎంతో సంతృప్తిని కలిగిస్తుందని తెలిపారు. అన్నదానం మహాదానమని, వృద్ధులకు సేవ చేయడం ద్వారా మానవత్వానికి విలువనిచ్చినట్లవుతుందని పేర్కొన్నారు. వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆప్యాయతతో పాటు అవసరమైన సమయంలో భోజనం అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ మరింత మందికి సహాయం అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

నిత్య అన్నదాన కార్యక్రమం ద్వారా వృద్ధులకు ఎంతో ఉపయోగం కలుగుతోందని గ్రామస్థులు తెలిపారు. సేవా సంస్థ అందిస్తున్న సహకారాన్ని అభినందించారు. సమాజంలో సేవాభావాన్ని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నాన్న స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు సురేపల్లి మాధవి, సురేపల్లి రవి, మార్కెట్ యార్డు డైరెక్టర్ మందిసభ్యులు, యడవల్లి శ్రీను, కాటం వెంకటరామిరెడ్డి, ముప్పిడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home